సంక్రాంతి పిండివంటలు.. అమిత శక్తిదాయకాలు!
సంక్రాంతి పండుగ.. తెలుగు వాళ్లకు పెద్ద పండుగ. పల్లెల నుంచి పట్టణాల దాకా సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవడం సంప్రదాయం. ఈ పండుగను తలచుకోగానే చటుక్కున స్ఫురించేవి.. ఘుమఘుమలాడే పిండి వంటలే! కొత్త అల్లుళ్లు.. కొంటె మరదళ్లు.. తాతా- మనవళ్లు, అమ్మమ్మ- మనవరాళ్ల సందడికి తోడు కొత్త పంటలతో చేసే వివిధ పిండి వంటల్ని అయినవాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆరగించడం.. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఈ సంక్రాంతికి మాత్రమే ప్రత్యేకం!మన పెద్దలు సంప్రదాయమంటూ ఏం చెప్పినా.. దానివెనుక ఏదో ఒక పరమార్థం ఉండేలా జాగ్రత్త పడ్డారు. సంక్రాంతికి చేసుకునే వివిధ పిండివంటలకూ ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతికి దాదాపుగా ప్రతి కుటుంబం అరిసెలు, అత్తిరాసాలు, ఓలిగలు, కజ్జికాయలు, వివిధ రకాల లడ్డూలు, నువ్వుల ఉండలు, వేరుసెనగ ఉండలు, మైసూరుపాక్ వంటి మిఠాయిలతో పాటు.. చెక్కిలాలు, జంతికలు, చెక్కలు, మిక్చర్ వంటి కారాలూ చేసుకుంటారు. దాదాపు 15, 20 రోజులకుపైగా నిల్వ ఉండే అత్తిరాసాలు, కజ్జికాయలను పండగ తర్వాత కూడా ఇంటికి వచ్చే వారందరికీ పంచుతూ.. ఆ తీపితో పాటు తమ ఆప్యాయత అభిమానాల్ని పంచుతుంటారు. ఆయా పిండివంటల్లో వాడే పదార్థాలు.. వాటిని తినడం వల్ల ఒనగూడే ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ చాలానే ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.వీటి తయారీకి ప్రధానంగా బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వినియోగిస్తారు. బియ్యంలో కార్బోహైడ్రేట్లు, బెల్లంలో ఇనుము (ఐరన్) సమృద్ధిగా ఉంటాయి. దీంతో రక్తవృద్ధి, శుద్ధి జరుగుతుంది. అదే మంచి ఆవునెయ్యితో చేస్తే.. కొలెస్ట్రాల్ శాతం బాగా తక్కువగా ఉండటమే కాక.. మంచి పుష్టికరమైన ఆహారంగా కూడా పని చేస్తుంది. ఇందులో వేసే గసగసాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. కొబ్బరి బలమైన ఆహారం. బియ్యం, బెల్లం త్వరగా బలాన్నిచ్చే దినుసులు. ప్రత్యేకించి బెల్లం అజీర్ణాన్ని అరికడుతుంది. రోజుకు నాలుగైదు చొప్పున తీసుకుంటే.. ఎనలేని శక్తి సమకూరుతుంది. మనిషికి కండ పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో బలమైన శక్తినిచ్చేవి ఈ అత్తిరాసాలు, అరిసెలే!శనగబేడలు, బెల్లం మిశ్రమంతో ఓలిగలు చేస్తారు. ఈ మిశ్రమానికి పైరేకుగా గోధుమపిండి లేదా మైదా పిండిని వాడతారు. నెయ్యితో చేసే ఈ మిఠాయిలో వేసే శనగల్లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు దండిగా ఉంటాయి. బెల్లంలో ఉండే ఇనుము మంచి శక్తివాహకంగా పని చేస్తుంది. గోధుమపిండి, మైదా పిండి పదార్థాలే. రెండూ బలవర్థకాలే. వేరుసెనగ నూనె కంటే రుచికరమైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు తక్కువ. అయితే ఓలిగలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. గరిష్టంగా రెండు రోజులకు మించి నిల్వ ఉంచడం మంచిది కాదు.వీటినే కజ్జికాయలనీ వ్యవహరిస్తుంటారు. బెల్లం, లేదా చెక్కెర, శనగపప్పు, కొబ్బరి, గోధుమ పిండితో తయారు చేస్తారు. బెల్లం, చెక్కెరలో ఐరన్, గోధుమ పిండిలో ప్రొటీన్, పప్పుల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిల్లో వాడే యాలకులు కూడా మంచి రుచిని ఇవ్వడమే కాదు.. జీర్ణశక్తిని పెంచుతాయి. ఆకలి బాగా ఉండేలా చేస్తాయి.రుచి, శుచిలతో పాటు బలానికి మారుపేరు లడ్డు. ఇందులో చాలా రకాలున్నాయి. దాదాపుగా అన్ని రకాల్లో శనగపిండి, చక్కెర, నూనె వాడతారు. జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వాడతారు. లడ్డూ మంచి బలమైన ఆహారం. ఇందులో వేసే జీడిపప్పు, బాదంల ద్వారా ఫాటీయాసిడ్లు, అమినో యాసిడ్లు బి-కాంప్లెక్స్ విటమిన్‌లు లభిస్తాయి. బలవర్థకంగా పని చేస్తాయి. ద్రాక్ష, కిస్మిస్‌ల ద్వారా సి- విటమిన్ లభిస్తుంది.శనగపిండి, చక్కెర, నూనె లేదా నెయ్యితో చేసే మైసూర్‌పాక్ కూడా బలవర్థకమైన ఆహారమే. ఎక్కువ కాలరీలున్న దృష్ట్యా దీన్ని కాస్త మితంగా తీసుకోవాల్సివుంటుంది.మురుకులు, జంతికలు, చక్కిలాలు, చెక్కలు, కారప్పూస.. ఇవన్నీ కారాల జాబితాలోవే. వీటన్నింటి తయారీకి వాడే ముడిపదార్థాలు దాదాపు ఒక్కటే అయినా.. చేసే పద్ధతుల్ని బట్టి రకరకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. వీటి తయారీకి బియ్యం పిండి, శనగ పిండి, మినప పిండి, మైదాలతో పాటు ఇంగువ, జీలకర్ర వాము వంటివి వేసి నూనెలో వేయించి తయారు చేస్తారు. ఇవి తినేందుకు మంచి రుచిగా ఉండటమేకాక వాము, జీలకర్ర వంటివి ఉన్నందువల్ల తినేవారి జీర్ణశక్తిని పెంచుతాయి. సుమారు 20 రోజుల వరకూ నిల్వ ఉండే ఈ కరకరలాడే కారాలన్నీ అందరికీ నచ్చుతాయి. పిండివంటల కోవలోకి రాకున్నా.. ఈ పండగకి అంతా ఇష్టంగా తినే మరో వంటకం రేగుపళ్ల పచ్చడి.. పుల్లపుల్లగా..కాస్త తీయగా.. మరికాస్త కారంగా ఉండే ఈ పచ్చడి మంచి రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి సి-విటమిన్‌ను, శక్తిని పుష్కలంగా అందిస్తుంది.సంక్రాంతి వంటి పండగలప్పుడు అంతా 'అతి సర్వత్ర వర్జయేత్'.. అన్న సూక్తిని గుర్తుంచుకోవాలి. మితంగా పద్ధతి ప్రకారం తింటేనే.. ఆయా పదార్థాలు ఆరోగ్యం, బలం, ఆనందాన్నిస్తాయని గమనించాలి. నిజానికి మన సంప్రదాయ వంటలన్నీ బలవర్థకాలే. అమిత శక్తిదాయకాలే. అయితే అతిగా తింటే మాత్రం అనర్థాలు తప్పవు. ఈ విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment