రాధామోహనపురంలో శివం, చంద్రం అనే యువకులు ఆకతాయి పనులతో కాలం గడుపుతుండే వారు. ఊరిలో వారంతా వారి దుష్టపనులకి అసహ్యించుకునే వారు. ఎందరో ఎన్ని విధాల వారి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఒక పర్యాయం పుండరీకుడు అనే స్వామీజీతీర్థయాత్రలు ముగించుకొని ఆ ఊరి రామాలయంలో శిష్యులతో బసచేసి ప్రతిదినం ప్రవచనాలు ప్రసంగించడం మొదలు పెట్టారు. భక్తులు వారి ప్రవచనాలు వింటూ ఎంతో తన్మయం చెందుతుండేవారు.
ఈవిషయం శివం, చంద్రం చెవిన పడి వారు ఎలా అయినా స్వామీజీని నలుగురిలో పరాభవించాలని నిశ్చయించుకున్నారు. శివం కొంత గడ్డిని, చంద్రం కొంత మట్టి ముద్దని తీసుకొని బయలుదేరి స్వామీజీ ప్రసంగించే ఆవరణ మూకలో కూర్చొని ప్రసంగం వినసాగారు.
స్వామీజీ ప్రవచనాలు సందర్భంలో “ఈ సువిశాల ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన అన్నింటికీ ఒక విలువ అంటూ ఉనది” అని వివరించారు.
అదే మంచి తరుణంగా భావించిన శివం, చంద్రం, వారు కూర్చున్నచోటునుంచి లేచి స్వామీజీతో “చేతిలోని గడ్డిని, మట్టిముద్దను చూపించి “మరి వీటి వెఇలువ ఎంతో తెలియజేయగలరా?” అన్నారు స్వామీజీని పరాభవించాలన్న తలంపుతో.
మూకలో కూర్చున్న వారంతా ఆశ్చర్యపోయారు. మరికొందరు వారికి దేహశుద్ధి చేయడానికి ముందుకు ఉరికారు. స్వామీజీ వారిని నివారించి మనిషి కోపతాపాలతో జయించగలిగినది ఏదీ ఉండదు. మీరలా చూస్తూ ఉండండి – అని గడ్డిని చేత్తో విసిరివేశారు. వెంటనే అక్కడ నెమరు వేసుకుంటున్న ఆవు కంటపడి ఆ గడ్డిని తినివేసింది. స్వామీజీ మట్టిముద్దను తీసుకొని చక్కగా ఒక లింగాన్ని తీర్చిదిద్ది అక్కడ ఉన్న పాలతో అభిషేకం జరిపి తలా కొంత పాలు తీర్థంగా పంచిపెట్టారు. అందరితో పాటు శివం, చంద్రం కూడా పాలు పుచ్చుకున్నారు. స్వామీజీ – “గడ్డితినే ఆవుపాలు భగవంతునికి చేసే అభిషేకంలో అవసరం పడుతుంటాయి. ఇహపోతే నెవు తెచ్చిన మట్టిముద్దను లింగ రూపంగా తీర్చిదిద్దడం వలన ఆ శంకరునే తలంచుకుంటూ భక్తులు ఆరాధిస్తున్నారు!” అన్నారు.
చంద్రం, శివం ఒక్క ఊపున స్వామీజీ కాళ్లమీద పడి “మమ్మల్ని క్షమించండి స్వామీ!” అన్నారు పశ్చాత్తాపంతో. స్వామీజీ వారిని నిండు మనస్సుతో ఆశీర్వదించారు.
No comments:
Post a Comment